- శ్రీవారికి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలతో పుష్ప కైంకర్యం
- భక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంతో 61 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ ఉద్యానవనాలు
- శ్రీవారి పుష్ప కైంకర్యానికి వెన్నుముకగా టీటీడీ ఉద్యానవన విభాగం
- దాతల సహకారంతో పుష్పోత్పత్తి, ఉద్యానవన సంరక్షణ
పురాణాల్లో పుష్ప మండపంగా పిలువబడిన కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్ప కైంకర్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా నభూతో నభవిష్యత్ అన్న చందంగా తిరుమలలో స్వామివారికి అనునిత్యం పుష్ప కైంకర్యాలు నిర్వహిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన పుష్ప కైంకర్యాలకు నిర్విఘ్నంగా పుష్పాలను సరఫరా చేస్తూ స్వామివారి పుష్ప కైంకర్యాలకు టీటీడీ ఉద్యానవన విభాగం వెన్నుముకగా నిలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం 1991 నుండి తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల అభివృద్ధి, సంరక్షణతో పాటు శ్రీవారి ఆలయానికి అవసరమైన పుష్పాల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది.తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో భక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంతో టీటీడీ ఉద్యానవనాలు విస్తరించి ఉన్నాయి.
ఇందులో 54 ఎకరాలు అలంకార ఉద్యానవనాలు, మిగిలిన 7 ఎకరాలు పుష్పోత్పత్తి తోటలుగా వినియోగంలో ఉన్నాయి. తిరుమలలో ఏడాదికి దాదాపు 450కు పైగా ఉత్సవాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు భారీగా పుష్పాల అవసరం ఉంటుంది.
శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలకు సంవత్సరానికి సుమారు 2.60 లక్షల నుంచి 2.70 లక్షల కిలోల పుష్పాలు కావాలి, ప్రతిరోజూ నిత్య ధూపదీప నైవేద్యాలకు సగటున 300 కిలోల పుష్పాలు వినియోగిస్తారు. తిరుపతిలోని స్థానిక ఆలయాలు, బయటి దేవాలయాల అవసరాలకు అదనంగా సంవత్సరానికి సుమారు 3 లక్షల కిలోల పుష్పాలు సరఫరా అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుండి పుష్పాలను సేకరించడంతో పాటు ఎప్పటికప్పుడు పుష్పాలను సరఫరా చేసేందుకు శ్రీవారి పుష్ప కైంకర్యంలో టీటీడీ ఉద్యానవన విభాగం విశేష కృషి చేస్తోంది. బ్యాంకాక్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల నుండి కూడా నాణ్యమైన పుష్పాలను సేకరిస్తూ టీటీడీ ఉద్యానవన విభాగం స్వామివారి కైంకర్యాలకు పుష్పాలను సరఫరా చేస్తోంది.
ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి 16 నుండి 18 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను సేకరిస్తారు. ఆరోజున స్వామివారికి ప్రతిరోజూ సమర్పించే అన్ని రకాల పుష్పాలు, పత్రాలను దాదాపు 10 టన్నులు సేకరించి పుష్ప కైంకర్యం చేసేందుకు టీటీడీ ఉద్యానవన విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.
టీటీడీ మూడు మార్గాల్లో పుష్పాలను సమకూరుస్తుంది. టీటీడీ సొంత పుష్ప తోటలు, భక్తుల విరాళాలు మరియు రిజిస్టర్డ్ రైతు సంఘాల ద్వారా కొనుగోలు చేసి పుష్పాల సరఫరా చేస్తారు. తిరుమల, తిరుపతి పరిసరాల్లోని అలంకార ఉద్యానవనాలు, సర్కిళ్ల సంరక్షణలో దాతల పాత్ర విశేషంగా ఉంటుంది.
మొత్తం 20 ప్రాంతాల్లో దాతల సహకారంతో ఉద్యానవనాల సంరక్షణ జరుగుతుండగా, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో మరో 16 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నిర్వహణ చేస్తున్నారు. గీతోపదేశం పార్క్, నామాల పార్క్, గరుడ సర్కిల్, లేపాక్షి సర్కిల్, శ్రీవారి పుష్ప ఉద్యానవనం వంటి ప్రాంతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రకృతి అందాలతో కూడిన ఉద్యానవనాలను పరిరక్షిస్తూ, భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తూ టీటీడీ ఉద్యానవన విభాగం ఆదర్శంగా నిలుస్తోంది.
